గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ లింగ ఎంపిక నిషేధ చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత స్పష్టం చేశారు. బుధవారం నస్పూర్ లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, అడగడం రెండూ చట్టరీత్యా నేరమని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో, జిల్లాలో పనిచేస్తున్న స్కానింగ్ కేంద్రాలు, వైద్యుల వద్ద ఉన్న స్కానింగ్ మిషన్ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందులో భాగంగా గర్భిణీల పర్యవేక్షణ, స్కానింగ్ మిషన్ల తనిఖీలు, రికార్డుల నిర్వహణ, సి సెక్షన్ ఆడిట్ వంటివి చేపట్టాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ప్రతి స్కానింగ్ సెంటర్ లో లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన పుస్తకాన్ని, స్కానింగ్ మిషన్ల వివరాలను, సేవల రుసుముల వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఫోటోలు ఉండరాదని, గర్భిణులకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కొత్త స్కానింగ్ మెషిన్ కొనుగోలు లేదా పాత మెషిన్ తొలగింపునకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి అనుమతి తప్పనిసరి అని, మూసివేసిన కేంద్రాల పరికరాల విక్రయ వివరాలు అందించాలని పేర్కొన్నారు. పిండ హత్యల నివారణకు కమిటీ సభ్యుల సహకారం కోరారు. లోపాలున్న కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












