జిల్లాలో చేపట్టనున్న వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. భావితరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు సమగ్ర ప్రణాళికతో అధికారులు ముందుకు సాగాలని అన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న వనమహోత్సవాన్ని జిల్లాలో కూడా అదే రోజున ప్రారంభించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
2026 వనమహోత్సవం నాటికి జిల్లాలో 41 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమ అమలులో భాగంగా, నర్సరీలలోని మొక్కల వివరాలు, ప్లాంటేషన్ సైట్ల రిజిస్ట్రేషన్ వంటి సమాచారాన్ని ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. అటవీ అధికారులు మొక్కలు నాటే ప్రక్రియలో సహాయం అందిస్తారని, నాటిన మొక్కల జియో ట్యాగింగ్, రోజువారీ వివరాల నవీకరణ తప్పనిసరి అని తెలిపారు.
రహదారుల వెంబడి, పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలలో, బహిరంగ ప్రదేశాలలో మొక్కలు నాటాలని, ముఖ్యంగా గనుల ప్రాంతాలలో ఉష్ణోగ్రతల నియంత్రణకు మొక్కల పెంపకం దోహదపడుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అటవీ భూముల వివాదాలున్న ప్రాంతాలలో వెదురు మొక్కలను, ప్రజలు అధికంగా తిరిగే చోట్ల మొక్కలను నాటాలని, మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.












