రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థల ముఖ్య బాధ్యులతో కూడిన విస్తృత స్థాయి సమావేశం గురువారం వరంగల్ లోని హరత రిసార్ట్ లోని రుద్రమదేవి కన్వెన్షన్ లో జరిగింది. ఈ సమావేశంలో పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పలు కీలక సూచనలు చేశారు.
వరంగల్ లో జరిగిన ఈ పర్యావరణ సమావేశానికి 'ప్రకృతిమిత్ర' వ్యవస్థాపకులు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ కు నిర్వాహకులు ప్రత్యేక ఆహ్వానం అందించారు. వరంగల్ అదనపు కలెక్టర్ వై.వి. గణేష్ (ఐ.ఏ.ఎస్) ముఖ్య అతిథిగా హాజరు కాగా, విశ్రాంత డి.ఎఫ్.ఓ కాసిపేట పురుషోత్తం అధ్యక్షత వహించారు.
సమావేశంలో పర్యావరణ రక్షణ, ప్రకృతి అనుకూల అలవాట్లు, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టవలసిన కార్యక్రమాలపై యోగేశ్వర్ తన అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు. ఆయన సమర్పించిన "ఒక్కొక్కరు ఒక్క మొక్క" కవితా గానం సభికుల నుండి ప్రశంసలు పొందింది.
మంచిర్యాల జిల్లాలో 'ప్రకృతిమిత్ర' చేపడుతున్న కార్యక్రమాలను యోగేశ్వర్ వివరించారు. అనంతరం, మంచిర్యాల ప్రకృతి మిత్ర ద్వారా తయారు చేయబడిన పర్యావరణ బట్ట సంచులను అదనపు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, 'ప్రకృతిమిత్ర' అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ, రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు విస్తృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, పర్యావరణవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.












