మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ కన్వెన్షన్లో జరిగిన రాజ్యాంగబద్ధమైన ఆదర్శ వివాహ వేడుకలో 'ప్రకృతి మిత్ర' స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన పదార్థాల వినియోగంపై ప్రాధాన్యతనిచ్చారు.
నిరాడంబరంగా, సమాజానికి స్ఫూర్తిదాయక సందేశాన్నిస్తూ నిర్వహించిన ఈ వివాహ వేడుకలో, ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన కళాకృతులు, విత్తన బంతులు, మట్టి, వెదురు, బట్ట, గడ్డితో చేసిన వస్తువులను ప్రదర్శించారు. పర్యావరణానికి హాని చేయని పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ బుద్ధ భవన్ ప్రత్యేక అధికారి పాల్గొని, నిర్వాహకులను అభినందించారు. సంస్థ వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలు ప్రకృతి మిత్రులుగా మారాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన అధికారికి, నూతన వధూవరులకు పచ్చని మొక్కను, ప్రకృతి మిత్ర కళాకృతులను బహుకరించారు. ప్రకృతిమిత్ర వ్యవస్థాపకుడు యోగేశ్వర్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి జి.ఎం. మునిగంటి శ్రీనివాస్, ఎస్.ఓ. టు జి.ఎం. ఎస్. సత్యనారాయణ, గోసిక మల్లేష్, నాగేశ్వర్, కొండు జనార్ధన్, రజిత, రాజేంద్రప్రసాద్, బి. రాజశేఖర్, తొగరు సుధాకర్, యుగంధర్, ప్రకృతి ప్రేమికులు, అధికారులు పాల్గొన్నారు.












