Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 28
జైపూర్ మండలం పానూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం భూమి కబ్జాకు గురవుతోందన్న ఆరోపణలపై MPDO సత్యనారాయణ స్పందించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అలసత్వం వహించవద్దని అధికారులను హెచ్చరించిన ఆయన, వెంటనే వనం చుట్టూ ట్రెంచ్ తవ్వించి, మొక్కలు నాటాలని ఆదేశించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు కఠినంగా వ్యవహరించాలని జైపూర్ MPDO సత్యనారాయణ స్పష్టం చేశారు. జైపూర్ మండలం పానూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం భూమిపై కబ్జా ఆరోపణలు రావడంతో ఆయన సోమవారం అక్కడికి వెళ్లి స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా MPDO మాట్లాడుతూ.. ప్రకృతి వనానికి కేటాయించిన భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే వనం చుట్టూ ట్రెంచ్ తవ్వించి, భారీగా మొక్కలు నాటాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రకృతి వనాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఈ పర్యటనలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.












