హజీపూర్, 2026-11-28
వైద్య విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట ప్రాంతంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో 6 రోజుల పాటు నిర్వహించిన ఎంపీరియా2026 వార్షికోత్సవ వేడుకలకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ దేవాజి, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అశోక్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు చదువుతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర సృజనాత్మక కార్యకలాపాలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. వైద్య వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, విద్యార్థి దశ నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అవసరమని తెలిపారు.
కళాశాల అభివృద్ధి పనులు
2024లో వైద్య కళాశాల ఇండక్షన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు శాశ్వత భవనాలు, తరగతి గదులు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక ఏర్పాట్ల మధ్య విద్యార్థులు చదువుకున్నారని, ఈ విద్యా సంవత్సరం నాటికి శాశ్వత భవనాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం 3 బస్సులను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గత 5, 6 నెలలలో 10 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి అవసరమైన వైద్య పరికరాల మరమ్మతులు, ఆధునిక పరికరాల కొనుగోలు చేపట్టారని తెలిపారు. లాపరోస్కోపీ యూనిట్, ఎబిజి తదితర ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఎంసిహెచ్లో హైరిస్క్ శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ను మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అవసరమైన ఫర్నిచర్, వైద్య పరికరాల ఏర్పాటు పూర్తయితే మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇవి పూర్తయితే ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనుసంధానంతో మంచిర్యాల జిల్లా వైద్య రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.
వైద్య సేవల విస్తరణ
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ వైద్య సేవల విస్తరణకు అనుగుణంగా స్పెషలిస్ట్ వైద్యుల నియామకాలు చేపడుతున్నామని, ఖాళీలన్నీ భర్తీ అయ్యే వరకు నియామక ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇతర జిల్లాలకు వైద్య సేవలు అందించే రిఫరల్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. వైద్య విద్యార్థులు తమ ప్రాక్టికల్ శిక్షణ సమయంలో ఆసుపత్రికి వచ్చే వివిధ రకాల క్లిష్టమైన కేసులను పరిశీలించి, అనుభవజ్ఞులైన వైద్యుల వద్ద మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. అధిక సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందించే ఆసుపత్రులలో శిక్షణ పొందడం వల్ల భవిష్యత్తులో వైద్యులుగా మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వైద్య వృత్తిలో చిన్న పొరపాటు కూడా రోగి ప్రాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తత, నైపుణ్యం, బాధ్యతాయుతమైన వైద్య సేవలు ఎంతో ముఖ్యమని చెప్పారు. కళాశాలలో విద్యార్థులే స్వయంగా క్రీడా మైదానాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని, క్రీడా సామగ్రి, మైదానాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.







