రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్స్, కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో ఉపాధ్యాయులకు విద్యార్థుల భద్రత, మహిళల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థుల సమస్యలను గుర్తించి, సరైన సమయంలో షీ టీమ్స్‌కు సమాచారం అందించాలని ఎస్సై. హైమ ఉపాధ్యాయులను కోరారు.
మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో జనగణన శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనించి, వారి సమస్యలను తెలుసుకోవాలని, అవసరమైతే షీ టీమ్స్‌కు నివేదించాలని ఎస్సై. హైమ సూచించారు. వేధింపులకు గురైన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె తెలిపారు.
చిన్న పిల్లలకు 'గుడ్ టచ్', 'బ్యాడ్ టచ్' గురించి వివరించడంలో ఉపాధ్యాయుల పాత్రను ఆమె నొక్కి చెప్పారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
బాలల హక్కులు, పోక్సో చట్టంపై ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలని తెలిపారు. విద్యార్థినులు, మహిళల భద్రత కోసం 'T-Safe' యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురైనప్పుడు 100, 112 లేదా రామగుండం షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 6303923700కు సంప్రదించాలని సూచించారు.












