మందమర్రి మండలం అందుగులపేట శ్రీ కన్వెన్షన్ హాల్ లో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.
పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను మంత్రి సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ఎక్కువగా టాపర్లుగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతైనా నిధులు కేటాయిస్తుందని, విద్య ప్రతి ఒక్కరి హక్కు అని, అది స్వేచ్ఛను, ఆలోచనా శక్తిని ఇస్తుందని అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేశారు. చెన్నూరులో ATC సెంటర్ నిర్మాణంలో భాగంగా చదువుకుంటున్న విద్యార్థులకు 2 వేల రూపాయల స్కాలర్షిప్ అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని, విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని మంత్రి సూచించారు. గతంలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధిపై దృష్టి సారించామని, ఇక నుంచి విద్య, వైద్యంపై దృష్టి సారిస్తామని తెలిపారు.










