రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూల్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాకూర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి 2,216 కోట్ల రూపాయలతో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
రాబోయే గోదావరి పుష్కరాల కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, ఇందులో భాగంగా 3 కోట్ల రూపాయల అంచనా నిధులతో ఆలయ పున: నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో 1.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డివిజనల్ కార్యాలయాల భవన నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.











