రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు, పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపన చేశారు.
శనివారం గూడెం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి 2,216 కోట్ల రూపాయలు కేటాయించామని, గూడెం ఆలయ అభివృద్ధికి 70 కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, మక్కన్ సింగ్ ఠాకూర్, మంచిర్యాల, రామగుండం మేయర్లు ధర్ని మధుకర్, మహంకాళి స్వామిలు కూడా పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, రాబోవు గోదావరి పుష్కరాలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు చేపడుతున్నామని ఐ.టి. మంత్రి తెలిపారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా గూడెం గుట్ట పరిధిలో 74 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కూడా భూమి పూజ చేశారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు తీరాయని, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలతో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అనంతరం పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 9.70 కోట్ల రూపాయల మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సంఘ భవనాల నిర్మాణం, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో 2.30 కోట్ల రూపాయల నగరాభివృద్ధి నిధులతో సి.సి. రోడ్డు పనులు, 2 కోట్ల రూపాయలతో మురుగునీటి కాలువ నిర్మాణ పనులు, గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం పరిధిలో 58 కోట్ల రూపాయలతో ఆలయ పున: నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు, అలాగే 74.40 కోట్ల రూపాయల అంచనా నిధులతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.












