గోదావరిఖని, 2026-08-05
పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ఆగస్టు నెల సైబర్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సింగరేణి హెచ్ఓడీ అధికారులకు సైబర్ నేరాలు, పెట్టుబడి మోసాలు, డీప్‌ఫేక్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ఆగస్టు నెల సైబర్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్లో సింగరేణి హెచ్ఓడీ అధికారులకు సైబర్ నేరాలు, స్టాక్ మరియు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఓటీపీకేవైసీ మోసాలు, నకిలీ లింకుల ద్వారా జరిగే మోసాలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డీప్‌ఫేక్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సైబర్ భద్రత ప్రతిజ్ఞ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సైబర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, పాల్గొన్న వారితో సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ, ఆన్లైన్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ, సైబర్ భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం అత్యంత సమయోచితమైందని అన్నారు. కార్యక్రమంలో అందించిన సూచనలను సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి చేరేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
ఏఐతో పెరుగుతున్న మోసాలు
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎవరి ముఖచిత్రం, స్వరాన్నైనా పోలి ఉండే వీడియోలు, ఆడియోలు సులభంగా సృష్టించే పరిస్థితి ఏర్పడిందని లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, స్నేహితులు లేదా బంధువుల పేరుతో వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, సోషల్ మీడియా సందేశాలు వచ్చినా వెంటనే నమ్మకుండా వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని సూచించారు. స్నేహితుల సోషల్ మీడియా ఖాతాలు లేదా వాట్సాప్ ద్వారా అత్యవసరంగా డబ్బు పంపాలని వచ్చే సందేశాలను నమ్మి చాలామంది మోసపోయారని, భవిష్యత్తులో ఇటువంటి మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి అధికారి ముందుగా సైబర్ మోసాలపై అవగాహన పెంచుకుని, తమ ఆధ్వర్యంలోని ఉద్యోగులకు కూడా నిరంతరం అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రతి విభాగంలో సైబర్ భద్రతపై చర్చలు నిర్వహించడం ద్వారా మోసాలను గణనీయంగా నివారించవచ్చని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
పెట్టుబడి మోసాలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈసారి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 30 శాతం ఇన్వెస్ట్మెంట్ మోసాలేనని, పొదుపు చేసిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకునే ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన వారినే సైబర్ నేరగాళ్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.












