మంచేరియల్, 01-07-2026
రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు బి.రామ్ రెడ్డి, ఎ. భాస్కర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, బాల కార్మికులను రక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని డీసీపీలు తెలిపారు.
తెలంగాణ పోలీసుల మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 2026 జూలై 1 నుంచి జూలై 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తమ కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలో నెల రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాల ప్రణాళికతో పాటు అమలు చేయాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
డీసీపీలు మాట్లాడుతూ, తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను రక్షించడం, వారికి అవసరమైన సంరక్షణ, పునరావాసం కల్పించి తిరిగి సమాజంలో కలిసేలా చేయడమే ఆపరేషన్ ముస్కాన్–XII ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గల్లంతైన చిన్నారుల ఆచూకీ కోసం సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని, బాలల దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తులను, బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్లు (SJPU), యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (AHTU), ఆపరేషన్ ముస్కాన్ బృందాలు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, బాలల సంరక్షణ సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి తమ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి చిన్నారిని సురక్షితంగా గుర్తించి, రక్షించి, వారికి దీర్ఘకాలిక పునరావాసం కల్పించడంలో సంబంధిత అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని డీసీపీలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పోలీసు శాఖ, శిశు సంక్షేమ శాఖ, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ (ఎన్సీఎల్పీ)తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.











