మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు ఫిర్యాదు అందింది. ఈ అక్రమ తవ్వకాలపై స్థానిక రైతులు, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
జైపూర్ మండలంలోని ఎల్కంటి, శట్పల్లి, కుందారం, నర్సింగాపూర్ గ్రామాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. మట్టి పూడిక తీయడానికి అనుమతులు పొందిన కొందరు వ్యక్తులు, వాటిని దుర్వినియోగం చేస్తూ భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎల్కంటి గ్రామంలో అనుమతులు పొందిన ఒక వ్యాపారి, తన పనులను పెద్దపల్లికి చెందిన మాజీ NSUI జిల్లా అధ్యక్షుడికి అప్పగించి, రైతులకు చెందాల్సిన మట్టిని మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లోని రియల్ వ్యాపారాలకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఫిర్యాదుదారులు తెలిపారు.
అనుమతులు ముగిసిన తర్వాత కూడా కొందరు వ్యాపారులు అధికారుల కళ్లుగప్పి మట్టి తరలింపునకు పాల్పడుతున్నారని, స్థానిక రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై DSP ధర్మ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ నాయకులు రాకేష్ రేగుంట, MRPS జిల్లా ఉపాధ్యక్షులు జలంపెళ్లి శ్రీనివాస్ లతో కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమ మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.












