నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చూడటం ద్వారానే నేరాల సంఖ్యను అదుపు చేయవచ్చని, బాధితులకు న్యాయం అందించడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరస్తులకు శిక్ష పడేలా సాక్ష్యాధారాలను సమర్పించి, ట్రయల్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కోర్టులో బాధితులకు న్యాయం జరిగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, దోషులకు శిక్ష పడేలా చూడటంలో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత చాలా ముఖ్యమని సీపీ నొక్కి చెప్పారు. నేరస్తులకు సంబంధించిన వారెంట్లు, సమన్లను సత్వరమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నివేదించాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సూచనలను పాటించాలని ఆదేశించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను, వారెంట్లు, సమన్ల వివరాలను సీసీటీఎన్ఎస్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
బాధితులకు న్యాయం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా శిక్ష పడేలా కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.










