మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు, యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి బెల్లంపల్లి రైల్వే స్టేషన్, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రయాణికుల సామాను, అనుమానాస్పద పార్సిల్స్, వ్యక్తులను ప్రత్యేకంగా పరిశీలించారు. శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ సహాయంతో మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రయాణికులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా నిరోధించడం, ప్రజల భద్రతను కాపాడడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా అందించాలని బెల్లంపల్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హానోక్, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, పోలీసు సిబ్బంది, నార్కోటిక్స్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం పాల్గొన్నారు.











