రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో, పెద్దపెల్లిలో మహిళల భద్రత, బాలల రక్షణ, ఆన్లైన్ మోసాలు మరియు మాదకద్రవ్యాల నివారణపై షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య మహిళలకు పలు సూచనలు అందించారు.
పెద్దపెల్లి జాగృతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సులో, ఎస్ఐ లావణ్య మహిళల భద్రతకు షీ టీమ్ చేస్తున్న కృషిని వివరించారు. బస్టాండ్లు, జనసమ్మర్థ ప్రాంతాలు, కళాశాలల వద్ద నిరంతర పహారా ఉంటుందని తెలిపారు.
వేధింపులకు గురైన మహిళలు 6303923700 నంబర్‌కు సంప్రదించవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె హామీ ఇచ్చారు. ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా మోసం జరిగితే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు డయల్ చేయాలని సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత కూడా పాల్గొన్నారు.










