Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 18
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ ఎస్టీపీ ప్లాంట్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 41 వాహనాలను సీజ్ చేయడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు పలు కీలక సూచనలు చేశారు. గంజాయి, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జైపూర్ ఎస్టీపీ ప్లాంట్‌లోని లేబర్ క్యాంపులో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. జైపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్సై భూమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల నివాస ప్రాంతాలలో బ్యారక్‌లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 22 బైక్‌లు, ఆరు మినీ బస్సులు, తొమ్మిది ట్రాలీ వాహనాలు, నాలుగు ఆటోలను సీజ్ చేశారు.
కార్యక్రమానికి హాజరైన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు తమ స్వగ్రామ పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి పోలీస్ కేసులు లేవని తెలిపే ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్‌కు అప్పగించాలని సూచించారు. అదేవిధంగా, కార్మికులు నివసించే బ్యారక్ల చుట్టుపక్కల తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్లాంట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, గంజాయి, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయిని సేవించడం, కొనుగోలు చేయడం, విక్రయించడం, రవాణా చేయడం వంటివి చేయవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా, సరఫరా చేస్తున్నా లేదా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నా వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గంజాయి సంబంధిత నేరాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు స్థానిక చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని సూచించారు. గుర్తింపు కార్డులు, ఆధార్ వంటి ధ్రువపత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలని, యాజమాన్యం వద్ద తమ పూర్తి వివరాలు నమోదు చేయించాలని తెలిపారు. ప్లాంట్ పరిసరాల్లో గొడవలు, మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం, చట్టవిరుద్ధమైన పనుల్లో పాల్గొనడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏవైనా వ్యక్తిగత సమస్యలు, వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
సైబర్ నేరాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. మోసపూరిత కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే పోలీసులకు లేదా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రతి కార్మికుడు చట్టాలను పాటిస్తూ, పరస్పర సహకారంతో పనిచేస్తే సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని, ప్రజల భద్రత, నేరాల నివారణ కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సమయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని ఏసీపీ తెలిపారు.












