మంచేరియల్, 2026-06-05
కులమతాలకు అతీతంగా, మానవత్వానికి మారుపేరుగా నిలిచిన ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్. ఫయాజుద్దీన్ తన ఇంటిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న మధునమ్మ మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భౌతికకాయాన్ని స్వయంగా తన భుజాలపై మోసి అంత్యక్రియలు నిర్వహించి, అందరి మన్ననలు పొందారు.
ఈ రోజుల్లో పదవులు, డబ్బు, ప్రాబల్యం ఉన్న చోట మనుషులకు, మమకారాలకు విలువలు తగ్గుతున్న కాలం. హోదా రాగానే పాత సంబంధాలను, కష్టకాలంలో తోడున్న వారిని మరిచిపోయే ఈ సమాజంలో, ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్. ఫయాజుద్దీన్ తన మంచితనంతో, మానవత్వంతో ప్రతి ఒక్కరి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందిస్తూ, తన జీవితమే ప్రజల సేవకే అంకితమనే తపనతో ఆయన నిరంతరం శ్రమిస్తుంటారు.
కులమతాలకు అతీతమైన సేవ
తాను ముస్లిం అయినప్పటికీ, కులమతాల సరిహద్దులను దాటి హిందువుల దహన సంస్కారాలకు సైతం స్వయంగా హాజరవుతారు. కర్మకాండలు పూర్తియ్యేంత వరకు దగ్గరుండి చూసుకునే మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. గ్రామంలో అందరినీ అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తూ, కుటుంబంలో ఒకరిగా కలిసిపోతుంటారు.
మధునమ్మతో అనుబంధం
ఇటీవల తమ ఇంట్లో దశాబ్దాలుగా బట్టలు ఉతుకుతూ, కుటుంబంలో ఒకరిగా మెలిగిన మధునమ్మ శనివారం రోజున మరణించడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అంతేకాకుండా, అంత్యక్రియల్లో సర్పంచ్ ఫయాజుద్దీన్ స్వయంగా ఆమె భౌతికకాయాన్ని తన భుజాలపై మోసుకుంటూ వెళ్లడం గ్రామాన్నంతటినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.
నానమ్మలా భావించి...
ఆమెను కేవలం ఒక శ్రామిక మహిళగానో, పనిమనిషిగానో కాకుండా సొంత నానమ్మలా భావించిన ఫయాజుద్దీన్, ఆమె భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టారు. చిన్నతనం నుండి తమ ఇంట్లోనే ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న మధునమ్మ తమను విడిచిపోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం వరకు తమ ఇంటి పనులు చేసి, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి నాలుగు రోజులు చికిత్స పొందుతూ శనివారం కన్నుమూయడం ఆయనను తీవ్రంగా కలచివేసింది.
సర్పంచ్ భావోద్వేగ వ్యాఖ్యలు
మధునమ్మ మాకు కేవలం చాకలి ఆమె మాత్రమే కాదు, మా కుటుంబంలో ఒక సభ్యురాలు, మా నానమ్మతో సమానం. ఆమె మరణం మా ఇంట్లో ఒక పెద్ద దిక్కును కోల్పోయినంత బాధను కలిగిస్తోంది. ఈ కలికాలంలో డబ్బుకే, పదవులకే విలువ ఇచ్చే పరిస్థితులు ఉన్నా, బంధాలకు, ప్రేమాభిమానాలకు విలువ ఇవ్వడమే నిజమైన మానవత్వం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని సర్పంచ్ ఫయాజుద్దీన్ అత్యంత భావోద్వేగంగా తెలిపారు.
గ్రామస్తుల ప్రశంసలు
హోదాలు, కులమతాల భేదం లేకుండా, ఒక సామాన్య శ్రామిక మహిళ మృతికి సర్పంచ్ ఫయాజుద్దీన్ స్వయంగా భౌతికకాయాన్ని భుజాన మోసి చూపిన ఈ అపారమైన అభిమానం, మానవత్వం ఇందారం గ్రామ ప్రజల మనసులను తడిమేసింది. ఆయనలోని ఈ మంచితనాన్ని, ప్రజాప్రతినిధికి ఉండాల్సిన అసలైన సంస్కారాన్ని చూసి గ్రామస్తులు ముక్తకంఠంతో కొనియాడుతున్నారు.










