బతుకమ్మ పండుగను సామాజిక చైతన్య వేదికగా మలచాలని, పాటల ద్వారా బీసీ మహిళల హక్కులను సాధించాలని హైకోర్టు న్యాయవాది, బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పేరం అలేఖ్య పిలుపునిచ్చారు. బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు, కులగణన ఆవశ్యకతను పాటల్లో పొందుపరచాలని ఆమె మేధావులకు విజ్ఞప్తి చేశారు.
బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, అది తెలంగాణ మహిళా శ్రామిక శక్తికి, ప్రకృతికి, సమూహానికి ప్రతీక అని పేరం అలేఖ్య అన్నారు. శతాబ్దాలుగా మన అమ్మలు, అక్కలు ఏ గ్రంథాలు లేకుండానే తమ జ్ఞానాన్ని, చరిత్రను, సామాజిక స్థితిని పాటల రూపంలో తరతరాలకు అందిస్తున్నారని, బతుకమ్మ పాట ఒక ఓరల్ హిస్టరీ - ఒక సామాజిక పత్రమని ఆమె తెలిపారు.
నేడు మనం ఒక చారిత్రక సంధి కాలంలో ఉన్నామని, రాష్ట్ర జనాభాలో 56 పైగా ఉన్న బీసీలకు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దక్కుతున్న వాటా కేవలం 29 మాత్రమేనని ఆమె వాస్తవాలను గుర్తు చేశారు. 1931 తర్వాత కులగణన జరగలేదని, మన సంఖ్య తెలియకుండా మన వాటా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) మరియు 340 ప్రకారం మనకు లభించిన హక్కులను మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం మనలో చైతన్య లోపం, ఐక్యత లోపమేనని ఆమె పేర్కొన్నారు.
సామాజిక చైతన్య వేదికగా బతుకమ్మ
అందుకే, ఈ బతుకమ్మ పండుగను మనం ఒక సామాజిక చైతన్య వేదికగా మలచాలని ఆమె పిలుపునిచ్చారు. మేధావులైన మీకు నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈసారి మీరు అల్లే బతుకమ్మ పాటల్లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల ఆశయాలను, రాజ్యాంగంలో బీసీలకు ఉన్న హక్కులను, కులగణన ఆవశ్యకతను, బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్ల ఆవశ్యకతను పాటల రూపంలో పొందుపరచాలని కోరారు.
ఆ పాట కేవలం పాట కాకూడదని, అది ఒక మేనిఫెస్టో కావాలని, వచ్చే తరానికి ఒక దిక్సూచిగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. మీరు రాసిన, పాడిన ఆ పాటలను డాక్యుమెంట్ చేసి, రాష్ట్రస్థాయి బీసీ మహిళా సదస్సులో ప్రచురిస్తామని తెలిపారు. ఉత్తమ రచనలకు బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తరపున బీసీ చైతన్య పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని వెల్లడించారు.
పూలను పేర్చడం మన సంస్కృతి అయితే, హక్కులను సాధించడం మన బాధ్యత అని, రెండింటినీ కలిపి చరిత్ర సృష్టిద్దామని ఆమె పిలుపునిచ్చారు. తమ పాటలను (లిరిక్స్ వీడియో) 6304571117 నంబర్‌కు పంపాలని కోరారు. చరిత్రను పాటల్లో లిఖించే మీకోసం ఎదురుచూస్తున్నామని ఆమె తెలిపారు.












