రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా అనేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి (చందారం) లో జాతీయ గ్రామీణ విత్తన ఉత్పత్తి - విత్తన శుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా అనేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి (చందారం) లో చందారం గ్రామ రైతు పొదుపు, పరపతి, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తన ఉత్పత్తి - విత్తన శుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, జిల్లా రైతులకు అవసరమైన విత్తన ఉత్పత్తి, శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, మెటీరియల్, ఎక్విప్మెంట్ సమకూరుస్తామని తెలిపారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షిస్తూ, ఇప్పటివరకు దాదాపు 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 12 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన లారీలను సమకూర్చామని, సింగరేణి, ఇసుక రవాణా లారీలను కూడా ఈ ప్రక్రియకు మళ్లించామని పేర్కొన్నారు. వర్షాలు రాకముందే ధాన్యం కొనుగోలు చేసి, గోదాములు, రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
కొనుగోలు చేసిన ధాన్యం విలువలో 98 శాతం వరకు రైతులకు 48 గంటల్లోనే చెల్లింపులు జరిగాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారం, రైతుల నమోదు ప్రక్రియ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై దృష్టి సారించామని, ఆధార్ లింకేజీ ద్వారా యూరియా, విత్తనాలు, ధాన్యం విక్రయ బుకింగ్ జరుగుతోందని, సాదా బైనమా దరఖాస్తులను కూడా పరిష్కరిస్తున్నామని వివరించారు. పంట సాగులో రైతులు లబ్ధి పొందేలా పంట మార్పిడి, సాగు మెలకువలు, లాభాలు, భూసారం పరిరక్షణ, నానో యూరియా వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, జిల్లాలో దాదాపు 22 వేల టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశామని, జిల్లా వ్యాప్తంగా 452 కోట్ల చెల్లింపులు జరిగాయని, మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 270 కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఈసారి ఐ.కె.పి. వారికి కొనుగోలు కేంద్రాలు కేటాయించామని, రాష్ట్ర వ్యాప్తంగా 20 శాతం కొనుగోలు కేంద్రాలు ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. రైతు సంక్షేమంలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని, ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలతో రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు.












