రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రమాదానంతరం మొదటి గంట 'గోల్డెన్ అవర్'గా అత్యంత కీలకమని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా గోదావరిఖనిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
గోదావరిఖనిలోని కెమిస్ట్ భవనంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో, ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీస్ కేసుల్లో చిక్కుకుంటారనే అపోహలను ఏసీపీ తొలగించారు. బాధితులను తరలించిన వారికి 'రహ వీర్ పథకం' కింద రూ. 25 వేల ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే అందించే వైద్యం ప్రాణాలను కాపాడే అవకాశాలను పెంచుతుందని, దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ, 'గోల్డెన్ అవర్'లో మెడికల్ సిబ్బంది స్పందన, తక్షణ చికిత్స అందించడం అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన సూచించారు. మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ సిబ్బంది బాధితులకు సహాయం చేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాలపై, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రమాద సమయాల్లో వైద్య సిబ్బంది పాత్రను స్పష్టంగా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి ఉద్దేశించబడింది.











