Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 15
యాసను చూసి మనిషిని కొలవరాదని, ఎందుకంటే యాస వెనుక ఒక ఊరి ఊపిరి, ఆ ఊరి మట్టి పరిమళం, తరతరాల మమకారం, మనసుల మధురం ఉంటాయని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి అన్నారు. పుస్తకాల్లోని భాషకు అక్షరాల అందం ఉంటే, పల్లె పెదవుల పలుకుల్లో జీవన గంధం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
యాసను చూసి మనిషిని కొలవరాదని, ఎందుకంటే యాస వెనుక ఒక ఊరి ఊపిరి, ఆ ఊరి మట్టి పరిమళం, ఆ మట్టిలో తరతరాల మమకారం, ఆ మాటల్లో మనసుల మధురం ఉంటాయని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి అన్నారు. పుస్తకాల్లో భాషకు అక్షరాల అందం ఉంటే, పల్లె పెదవుల పలుకుల్లో జీవన గంధం ఉంటుందని, గ్రంథాల్లో వ్యాకరణం ఉంటే, గ్రామీణ యాసలో అనుభవాల ఆభరణం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
అది బడిలో బోధించిన భాష కాదని, అమ్మ ఒడిలో ఆలపించిన ఆప్యాయ గీతమని, నాన్న నుదుటి చెమటలో నిండిన జీవన జ్యోతి, రైతు నేలతో పలికిన పచ్చని మాట, కూలీ కష్టంలో వినిపించిన నిజమైన గీతమని ఆమె అభివర్ణించారు. యాసను హేళన చేయడం అంటే ఒక మాటను కాదు, ఒక మనిషి మూలాలను మట్టుబెట్టడమేనని, అతని ఊరి గౌరవాన్ని గాయపరచడమేనని, అతని జ్ఞాపకాల జాడలను చెరిపివేయడమేనని ఆమె అన్నారు.
ప్రతి యాస వెనుక ఒక యుగం, ప్రతి పలుకు వెనుక ఒక అనుభవం, ప్రతి మాటలో ఒక మనిషి మనసు, ప్రతి స్వరంలో ఒక సంస్కృతి శ్వాసిస్తుందని మంజుల తెలిపారు. యాస మారితే మనిషి మారడని, మాట మారినా మనసు మారదని, పలుకు మారినా పుట్టిన నేల మారదని, మారేది కేవలం భాషకు వచ్చిన భిన్నమైన అందం మాత్రమేనని ఆమె అన్నారు.
కాబట్టి, యాసలను ఆదరిద్దామని, భాషలను ప్రేమిద్దామని, భిన్నత్వంలోని అందాన్ని ఆస్వాదిద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఎందుకంటే భాష మనల్ని కలుపుతుందని, యాస మన మూలాలను నిలుపుతుందని, యాసను గౌరవించడం అంటే మన సంస్కృతికి శిరస్సు వంచి నమస్కరించడమేనని ఆమె తెలిపారు. అదే నిజమైన విద్య, అదే నిజమైన వినయం, అదే నిజమైన సంస్కారం, అదే నిజమైన నాగరికత అని ఆమె పేర్కొన్నారు.
రచన: మంజుల పత్తిపాటి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చరవాణి 9347042218.







