రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన కార్యాచరణ ప్రకారం, జూన్ 15 నుండి 24 వరకు సిబ్బందికి, అధికారులకు శిక్షణ, ఫారం ప్రింటింగ్ వంటి ఏర్పాట్లు జరుగుతాయి. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ ఫారాలు అందజేసి, తిరిగి సేకరిస్తారు. ఈ కాలంలోనే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కూడా పూర్తవుతుంది.
జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుంది. సవరణకు ముందే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల అధికారి సూచించారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, వారికి ఈ ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ సంబంధిత దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 మందికి మించి ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బూత్ స్థాయి అధికారుల వివరాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని, వృద్ధ, అనారోగ్య, దివ్యాంగ ఓటర్ల నమోదుపై ప్రత్యేక శిక్షణ అందించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని సూచించారు. మీడియా, సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని తెలిపారు.










