ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు తీరుపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
మంచిర్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో, కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి గ్రామంలో నాలుగు రకాల చెత్త నిర్వహణ చేపట్టాలని, వ్యర్థాల నుంచి ఉపయోగకర ఉత్పత్తుల తయారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, దాదాపు 50 లక్షల మందికి ఈ సేవలు అందుతాయని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు తయారు చేసే అవకాశాన్ని స్వయం సహాయక సంఘాలకు కల్పించడం ద్వారా వారి ఆదాయ వనరులను పెంపొందించినట్లు తెలిపారు. లక్ష మంది విద్యార్థులకు దుస్తులు అందించారని, విద్యా సంస్థల పరిసరాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. మాదకద్రవ్యాలు, గంజాయి వంటి హానికర పదార్థాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించి, అదనపు ఆదాయాన్ని వృద్ధి చేసుకునేలా ప్రోత్సహించాలని కమిషనర్ సూచించారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ, ప్రతి ఒక్కరూ చదువుకునేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో విద్యారంగంలో అమలు చేస్తున్న విధానాలు అభినందనీయమని ఆమె ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపార రంగాలలో చేయూత అందించాలని సూచించారు. త్వరలో పింఛన్ల విషయంలో ప్రజలకు శుభవార్త చెబుతామని, లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 3,073 మంది వ్యాధిగ్రస్తులను పరీక్షించి, 251 మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. క్షయ నిర్మూలన, యాంటీబయోటిక్ వినియోగ నియంత్రణ, సదరం శిబిరాల నిర్వహణపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. సంక్షేమ వసతి గృహాలలో పారిశుద్ధ్యం, ఆహార నాణ్యత, విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించామని తెలిపారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచామని, బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనాధలకు, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. రైతు వేదికలలో భూసార పెంపుదల, ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 10,305 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, 2,132 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ వివరించారు.












