రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏఆర్ సిబ్బంది, అధికారుల కోసం పోలీస్ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికే ఈ కార్యక్రమం అని, ప్రతి శనివారం కమిషనరేట్‌లో సిబ్బందిని కలుస్తామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఏఆర్ సిబ్బంది, అధికారుల కోసం పోలీస్ దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అధికారులతో, సిబ్బందితో మాట్లాడి వారి వృత్తిపరమైన అనుభవాలు, సమస్యలు, వినతులను ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏదైనా సమస్యను దర్బార్‌లో చెప్పడానికి ఇబ్బందిగా అనిపిస్తే కార్యాలయానికి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చని సీపీ సూచించారు. అందరూ ఒక కుటుంబమని, సమన్వయంతో, క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించడం ద్వారా రామగుండం కమిషనరేట్‌కు, తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, మంచి ప్రవర్తనతో విధులు నిర్వర్తించినప్పుడు అధికారులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.
సిబ్బంది చేయాల్సిన విధులు, చేయకూడని పనుల గురించి సీపీ పలు సూచనలు చేశారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి విధుల్లో నిర్లక్ష్యం వహించినా, పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ, యూనిఫామ్‌పై గౌరవం ఉంటే చట్టవ్యతిరేక పనుల వైపు ఆలోచనలు రావని పేర్కొన్నారు.
ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా మానసిక, శారీరక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో సమయం గడపాలని, వ్యక్తిగత కారణాలతో ఏర్పడే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని, కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. ప్రతి శనివారం సిబ్బందిని కలుస్తామని, సమస్యలుంటే నేరుగా కార్యాలయానికి వచ్చి కలవవచ్చని పునరుద్ఘాటించారు.










