మంచేరియల్, 2026-08-31
మంచిర్యాల జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం నస్పూర్ లో రెవెన్యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
మంచిర్యాల జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి రెవెన్యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహించిందని, భూ సమస్యల శాశ్వత పరిష్కారంలో భాగంగా రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 11 నాన్ కడస్ట్రల్ గ్రామాలు, 70 కడస్ట్రల్ గ్రామాలు, మొత్తం 81 గ్రామాలు రీ-సర్వేకు ఎంపికయ్యాయని చెప్పారు. తెలంగాణ సర్వే బౌండరీ చట్టం ప్రకారం రీ-సర్వేను నిర్వహిస్తున్నామని, చట్టంపై అవగాహనతో క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు.
గ్రామసభల ద్వారా పట్టదారులకు సమాచారం అందించాలని, మొదట గ్రామసభ నిర్వహించి సంబంధిత ప్రజలకు సమాచారం అందించి గ్రామ సరిహద్దును నిర్ణయించాలని సూచించారు. గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ సంబంధిత భూములను సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, జి.పి.ఓ.ల ఆధ్వర్యంలో గుర్తించాలని తెలిపారు. తదుపరి సర్వే బృందంతో పాటు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించాలని, సర్వే సమయంలో ఖచ్చితంగా ఫీల్డ్ రిజిస్టర్ను నిర్వహించాలని, సంబంధిత జి.పి.ఓ.లు అందుబాటులో ఉండి వివరాలను రికార్డు చేయడం ద్వారా క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. ప్రతి బృందం తమ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొని సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు.
రీ-సర్వే సమయంలో ఫీల్డ్ రిజిస్టర్, కో-రిలేషన్ స్టేట్మెంట్, ల్యాండ్ రిజిస్టర్లను నిర్వహించాలని, సర్వే, కో-రిలేషన్ స్టేట్మెంట్ తయారీతో పాటు నోటీసుల జారీ ప్రక్రియను ఏకకాలంలో చేపట్టాలని, రైతులకు నోటీసులు సకాలంలో అందజేయాలని, రీ-సర్వే ప్రక్రియపై రైతులలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల హద్దుల నిర్ధారణకు సంబంధించిన సమాచారాన్ని సర్పంచ్లు, రైతులకు అందించాలని, రీ-సర్వే ప్రక్రియలో ప్రజల సహకారం తీసుకుని పారదర్శకంగా పనులను పూర్తి చేయాలని సూచించారు.
రీ-సర్వేకు సంబంధించి నిర్ణీత ప్రొఫార్మాలో ఫారాలు అందుబాటులో ఉన్నాయని, నిబంధనల ప్రకారం సక్రమంగా పూర్తి చేసి రికార్డులను సిద్ధం చేయాలని సూచించారు. రీ-సర్వే పనులపై తహసిల్దార్లు ప్రత్యేక చొరవ చూపి, క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జి.పి.ఓ.లు భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను సక్రమంగా సిద్ధం చేసి, రీ-సర్వేకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు.











