మంచేరియల్, 2026-08-05
జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో రెవెన్యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన, భూ సమస్యల శాశ్వత పరిష్కారంలో రీ-సర్వే కీలకమని తెలిపారు.
జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లతో కలిసి రెవెన్యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూములకు సంబంధించి ఇప్పటికీ పాత రికార్డుల పైనే ఆధారపడుతున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టంను తీసుకువచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహించిందని, భూ సమస్యల శాశ్వత పరిష్కారంలో భాగంగా రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో 11 నాన్ కడస్ట్రల్ గ్రామాలు, 70 కడస్ట్రల్ గ్రామాలు, మొత్తం 81 గ్రామాలు రీ-సర్వేకు ఎంపికయ్యాయని, తెలంగాణ సర్వే బౌండరీ చట్టం ప్రకారం ఈ సర్వే జరుగుతుందని కలెక్టర్ వివరించారు. చట్టంపై అవగాహన కలిగి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. సర్వే 8 నియంత్రణ దశలలో జరుగుతుందని, చట్టబద్ధత, సంబంధిత అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
గ్రామసభల ద్వారా పట్టదారులకు సమాచారం అందించాలని, ముందుగా గ్రామసభ నిర్వహించి ప్రజలకు సమాచారం అందించి గ్రామ సరిహద్దును నిర్ణయించాలని కలెక్టర్ సూచించారు. గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ సంబంధిత భూములను సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, జి.పి.ఓ.ల ఆధ్వర్యంలో గుర్తించాలని ఆదేశించారు.
తదుపరి సర్వే బృందంతో పాటు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించాలని, సర్వే సమయంలో ఫీల్డ్ రిజిస్టర్ను ఖచ్చితంగా నిర్వహించాలని, తద్వారా క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కరణ సులభతరం అవుతుందని తెలిపారు. ప్రతి బృందం లక్ష్యానికి అనుగుణంగా సర్వే పనులను పూర్తి చేయాలని, అవసరమైన కార్యాచరణను రూపొందించాలని సూచించారు.
సర్వే, కొ-రిలేషన్ స్టేట్మెంట్ తయారీతో పాటు నోటీసుల జారీ ప్రక్రియను ఏకకాలంలో చేపట్టాలని, రైతులకు నోటీసులు సకాలంలో అందజేయాలని, రీ-సర్వే ప్రక్రియపై రైతులలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల హద్దుల నిర్ధారణకు సంబంధించిన సమాచారం సర్పంచులు, రైతులకు అందించాలని, రీ-సర్వే ప్రక్రియలో ప్రజల సహకారం తీసుకుని పారదర్శకంగా పనులను పూర్తి చేయాలని తెలిపారు.
రీ-సర్వేకు సంబంధించి ఫారాలు అందుబాటులో ఉన్నాయని, నిబంధనల ప్రకారం సక్రమంగా పూర్తి చేసి రికార్డులను సిద్ధం చేయాలని సూచించారు. రీ-సర్వే పనులపై తహసిల్దార్లు ప్రత్యేక చొరవ చూపి క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జి.పి.ఓ.లు భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను సక్రమంగా సిద్ధం చేసి, రీ-సర్వేకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు.










