భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా మంచిర్యాల బిజెపి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు ముఖర్జీ దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ ముఖర్జీ "ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా" అనే లక్ష్యంతో కాశ్మీర్ కోసం ప్రాణాలర్పించారని తెలిపారు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేసి జనసంఘ్ ను స్థాపించిన ముఖర్జీ, "ఈ దేశంలో రెండు నిషాన్, రెండు విధాన్ నహీ చలేగా" అని నినదిస్తూ, ఒకే దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జాతీయ జెండాలు ఉండరాదని పోరాటం ప్రారంభించి కాశ్మీర్ కు వెళ్లారని వివరించారు.
ఆ సమయంలో షేక్ అబ్దుల్లా ప్రభుత్వం డాక్టర్ ముఖర్జీని అనారోగ్యంతో ఉన్నప్పటికీ అతి శీతల ప్రదేశంలో ఉంచి హింసించి మరణానికి కారణమైందని, దీనిపై విచారణ జరపాలని అప్పటి ప్రధాని నెహ్రూని కోరినా, సత్సంబంధాల కారణంగా విచారణ జరగలేదని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ ప్రభుత్వం కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, కార్పొరేటర్ నాగరాజు, రాష్ట్ర నాయకులు తుల ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంకటకృష్ణ, తోట మల్లికార్జున్, బొట్ల సత్యం, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్న రాణి, గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమెరిశెట్టి రాజ్ కుమార్, నాయకులు వైద్య శ్రీధర్, చిరంజీవి, నల్లపు రమేష్, ప్రేమ్ సింగ్, రాజబాబు, రాజమౌళి, ప్రభాకర్, రవీందర్ తో పాటు పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.












