పెద్దపల్లి, 5 September
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా అని, అన్ని రంగాల్లో పెద్దపల్లి నియోజకవర్గం ముందంజలో ఉందని, కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
*అభివృద్ధి మరియు సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా..* *అన్ని రంగాల్లో పెద్దపల్లి ముందంజ..* *కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు..* *కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకో..* * రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్ నుంచి జెండా చౌరస్తా వరకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. రైతుల నుంచి గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన ఘనత నియోజకవర్గంలో తనదేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1540 కోట్లు సన్న ధాన్యానికి బోనస్ చెల్లిస్తే, పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.80.68 కోట్లను రైతులకు బోనస్ చెల్లించామని తెలిపారు. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు 25లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్లు ఒక్కో రైతుకు రూ. 2లక్షల చొప్పున రుణ మాఫీ చెల్లించి తిరిగి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడైనా ఏ ఒక్క రైతుకైనా లక్ష రూపాయల రుణ మాఫీ ఏక కాలంలో చేశారా అని ప్రశ్నించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ అక్కసు వెళ్లగక్కుతోందని దుయ్యబట్టారు. రూ. 5లక్షల నుంచి 10లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు గుడిసెల రహిత తెలంగాణ లక్ష్యంగా అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటికే మొదటి విడతలో 3వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని గుర్తు చేశారు. రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇంటి పథకంతో పేదల సొంతింటి కల నెరవేరిందన్నారు. మరో 10 రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 88కోట్లు విడుదల చేయించామని, పనులు కొనసాగుతున్నాయని, మరో 80 కోట్లు భూ సేకరణ కోసం నిధులు మంజూరు చేయించనున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు విస్తరించి రూ. 53 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు నంబర్ వన్ గా ఉన్నాయని కితాబునిచ్చారు. స్వయాన కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్జేబీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, కానీ పెద్దపల్లిలో మాత్రం ఆర్డీఓబీ పనులు చకచక సాగి పూర్తి దశకు చేరుకున్నాయన్నారు. రెండు, మూడు నెలల్లో ఆర్డీబీ ప్రజలకు అందుబాటులోకి కూడా తీసుకువస్తామని తెలిపారు. అవినీతి రహిత పాలనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలకు గతంలో 3100 కోట్ల వడ్డీ బకాయి పెట్టిన బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు హయంలో ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని కొనసాగిస్తున్నామని, విడతల వారీగా మహిళలకు వడ్డీ బకాయిలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్న రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ప్రతిపక్షాలకు అది మింగుడుపడటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

