జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుడ్రాతుపల్లి గ్రామపంచాయతీలో గురువారం జరిగిన గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆగ్రహించిన ఓ నిరుపేద, సర్పంచ్, కార్యదర్శి ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అప్రమత్తమై అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
గ్రామానికి చెందిన నగునూరు శ్రీనివాస్ గౌడ్ అనే నిరుపేద, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. మొదటి జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ, కక్షపూరిత రాజకీయాల కారణంగా చివరి జాబితా నుంచి తొలగించారని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయమై మనస్తాపం చెందిన ఆయన, గ్రామసభ జరుగుతుండగా వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను ఒంటిపై పోసుకున్నారు.
వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు, అక్కడున్న సిబ్బంది శ్రీనివాస్‌ను అడ్డుకొని, నిప్పంటించుకోకుండా కాపాడారు. దీంతో శ్రీనివాస్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనతో గ్రామసభ కొద్దిసేపు స్తంభించిపోయింది. బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్తులు కూడా డిమాండ్ చేశారు.
ఘటన అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, "రాజకీయ కక్షలతో నాలాంటి పేదోడికి అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తారని ఆశిస్తున్నారు.








