వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన బీజేపీ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ శిక్షణా శిబిరాలు పార్టీ బలోపేతానికి, కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపడానికి దోహదపడతాయని యెండల లక్ష్మి నారాయణ తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, కన్నం యుగదీశ్వర్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.












