మంచేరియల్, 2026-07-23
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్/నార్కోటిక్ బృందం మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసింది. ఈ ఆపరేషన్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగదు, పేకముక్కలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు గుంజపడుగు గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు.
ఈ దాడిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.43,540 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.
తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు మరియు ఇతర వస్తువులతో కలిసి మంథని పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.












