పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం మంచిర్యాల పట్టణంలో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. క్రీడా మైదానాల అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.
ఎంపీ వంశీకృష్ణ ఆదివారం మంచిర్యాలలో పర్యటించారు. మొదటగా హైటెక్ సిటీలోని బ్యాడ్మింటన్ కోర్టులో యువతతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్‌ను సందర్శించి, చిన్నారులతో క్రికెట్ ఆడారు. మైదానం అభివృద్ధికి 20 ట్రిప్పుల మట్టిని ఏర్పాటు చేయాలని సంబంధిత జీఎంకు సూచించారు.
చిన్నారులకు క్రీడా ప్రోత్సాహం కోసం రెండు క్రికెట్ కిట్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆకాంక్షించారు.
తరువాత మార్కెట్ ప్రాంతంలోని రత్నలాల్ హోటల్ వద్ద స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీటి వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
హోటల్ యజమానులు, వ్యాపారులతో మాట్లాడి గ్యాస్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. "ప్రజల సమస్యలే నా సమస్యలు. ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం నా బాధ్యత" అని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.











