రామగుండం, 2026-08-24
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మీలాద్-ఉన్-నబీ (ఈద్-ఎ-మిలాద్) పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముస్లిం మత పెద్దలకు, కమిటీ సభ్యులకు సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మీలాద్-ఉన్-నబీ (ఈద్-ఎ-మిలాద్) పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముస్లిం మత పెద్దలకు, కమిటీ సభ్యులకు సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని మత పెద్దలతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించారు.
ర్యాలీలు, జూలూసులపై సూచనలు
పండుగ సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, జూలూసులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, నిర్ణయించిన మార్గాల్లోనే కార్యక్రమాలు చేపట్టాలని సీపీ స్పష్టం చేశారు. ర్యాలీల సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను నియమించుకోవాలని సూచించారు. అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్లు, డీజేలు, ఇతర పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించరాదని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు, ఆసుపత్రుల్లోని రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
మత సామరస్యానికి ప్రాధాన్యత
మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రసంగాలు, పాటలు, నినాదాలకు దూరంగా ఉండాలని, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు. యువత శాంతి, క్రమశిక్షణతో వ్యవహరించి ఎలాంటి గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. పండుగ కార్యక్రమాల సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ర్యాలీల్లో పాల్గొనేవారు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీపీ ఈ సందర్భంగా అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పండుగ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు.
సోషల్ మీడియాపై నిఘా
కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, పుకార్లు సృష్టించే అవకాశం ఉందని, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అటువంటి పోస్టులను చూసి సంయమనం పాటించాలని సీపీ సూచించారు. ఏదైనా సమాచారం నిజమా, కాదా అనే విషయాన్ని స్థానిక పోలీసులను సంప్రదించి తెలుసుకోవాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే డయల్ 112, కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు.










