మండలంలోని కాన్కూర్ గ్రామస్తులు పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని గురువారం ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను అధికారులు వివరించారు.
‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా, కాన్కూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంత నీలగిరి ప్లాంటేషన్లో గ్రామస్తులకు పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవుల ప్రాముఖ్యతను, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను అధికారులు తెలియజేశారు.
అటవీ ప్రాంతాల్లో సంచరించే వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టకూడదని, వాటిని వేటాడటం చట్టరీత్యా నేరమని అధికారులు స్పష్టం చేశారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు.
గ్రామంలో ప్లాస్టిక్, ఈ-వేస్ట్, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ సాగరిక, కార్యదర్శి శ్రావణ్ గ్రామస్తులను కోరారు. పర్యావరణహిత పద్ధతులను అనుసరించడం ద్వారా పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ గణేష్, ప్లాంటేషన్ మేనేజర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటేశం గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రేగుంట చందు, టీజీ ఎఫ్డీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.











