భీమారం, 2026-09-08
రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బియ్యాన్ని త్వరగా అందించాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన భీమారం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, నిర్మాణాలను ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు.
బియ్యాన్ని త్వరగా అందించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ : రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బియ్యాన్ని త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని భీమారం మండలం అంకుశాపూర్ గ్రామంలో గల సమతా రైస్ మిల్ ను ఆకస్మికంగా సందర్శించి రైస్ మిల్లు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యాన్ని సామర్థ్యానికి అనుగుణంగా రైస్ మిల్లులకు కేటాయించడం జరిగిందని, రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని మద్దికల్ గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రతి రోజు తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, మురుగు కాలువలలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని తెలిపారు. నీటి నిల్వలు లేకుండా శుభ్రపరచాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి చేయాలని, నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మించిన ఇండ్లకు మాత్రమే బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామంలో కొంతమంది రైతులు వరి సాగు చేయడాన్ని గమనించి వారితో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. పంట సాగుకు బోర్లు, చెరువు అందుబాటులో ఉండడంతో వరి సాగు చేస్తున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియలో నిర్దేశిత విధానాలను పాటించాలని, ఫీల్డ్ రిజిస్టర్, విలేజ్ రిజిస్టర్ లలో వివరాలు నమోదు చేస్తూ సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. రీ సర్వే పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరేపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల జారీ, విచారణ కార్యక్రమాల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తయారీలో శుభ్రత నిబంధనలు పాటించాలని సిబ్బందికి సూచించారు. 6వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించి స్వయంగా వారికి పాఠ్యాంశాలు బోధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు పట్టిక, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సూచించారు. నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో మండల తహసిల్దార్ సదానందం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











