రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లా పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. జిల్లా అభివృద్ధికి ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ముఖ్యమంత్రి వెళ్లిపోవడం పట్ల ప్రజలు నిరాశకు గురయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన వల్ల జిల్లా అభివృద్ధికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ప్రశ్నించారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే నివాసానికి వచ్చి భోజనం చేసి వెళ్లారని, జిల్లా సమస్యలు, అభివృద్ధిపై ఎలాంటి ప్రకటనలు చేయలేదని అన్నారు. ఇది ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా 14 హామీలు ఉంటే, కేవలం రెండు మాత్రమే నెరవేర్చి ప్రజలను మోసం చేసిందని రఘునాథ్ ఆరోపించారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు కేటాయించిందో ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, గాజుల ముఖేష్ గౌడ్, అమిరిశెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రవర్తి, గడ్డం స్వామి రెడ్డి, బేర సత్యనారాయణ, మెట్టుపల్లి జయరామ రావు, సంజీవ్ రావు, నల్ల రవి, బింగి ప్రవీణ్, ఈర్ల సదానందం, చిరంజీవి, పొన్నవేణి సదానందం, తిప్పని భీమయ్య, రావణవేణి శ్రీనివాస్, శివ, ఆవిడపు రాజబాబు, సతీష్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.








