మహిళలు, పిల్లలపై హింస, వేధింపులు, దుర్వినియోగానికి గురైన బాధితులకు సమగ్ర రక్షణ, సహాయం, పునరావాసం, న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, భరోసా కేంద్రాల సేవలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవల సంస్థలు, బాలల సంరక్షణ విభాగాలు, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కౌన్సిలర్లు, ఇతర భాగస్వామ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం (డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్)–భరోసా పీఎంయూ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అందిస్తున్న సేవలను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దడానికి అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పారు. బాధితులకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్, వైద్య సేవలు, న్యాయ సహాయం, పునరావాసం, సంక్షేమ సేవలను ఒకే వేదికపై సమర్థవంతంగా అందించడంలో భరోసా కేంద్రాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ప్రతి బాధితుడితో సానుభూతితో, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
కేవలం చట్టపరమైన అంశాలకే పరిమితం కాకుండా, బాధితులకు మానసిక ధైర్యాన్ని అందించాలని, వారి సమస్యలను అర్థం చేసుకుని తక్షణ స్పందన అందించడం ద్వారా ‘గోల్డెన్ అవర్’ కోల్పోయే ప్రమాదాన్ని నివారించవచ్చని కమిషనర్ తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం లేని పరిస్థితుల్లోనూ చట్టపరమైన, మానవతా, మానసిక సహాయం అందించాలని, అవసరమైతే సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పై అధికారులను, పోలీస్ కమిషనర్‌ను నేరుగా సంప్రదించాలని ఆదేశించారు.
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసుల నమోదులో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని, ముందుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిఫరల్ వ్యవస్థను బలోపేతం చేయడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, నాణ్యమైన కౌన్సెలింగ్ సేవలు అందించడం, బాలల రక్షణ చర్యలను పటిష్టపరచడం, వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి, సహకారాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, సమీక్షించారు. బాధితుల సంక్షేమం, భద్రతను కేంద్రంగా చేసుకుని అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కమిషనర్ తెలిపారు.












