జైనూర్ (ప్రజావార్త) నవంబర్ 18
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మండలం పరిధిలోని మార్లవాయి గ్రామాన్ని ప్రతిమ ఫౌండేషన్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, యువతకు ఉపాధి, విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తుందని బృంద సభ్యురాలు గీతారెడ్డి తెలిపారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మండలం పరిధిలోని చారిత్రక మార్లవాయి గ్రామాన్ని ప్రతిమ ఫౌండేషన్ బృంద సభ్యురాలు గీతారెడ్డి ఆధ్వర్యంలో బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆదివాసీ ఆత్మబంధువులు హైమన్ డార్ఫ్, బెట్టీ ఎలిజబెత్ దంపతులకు నివాళులర్పించి, వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ సమావేశంలో గ్రామ ప్రజలు, యువతతో సమావేశమై గ్రామ అభివృద్ధి, ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ, మార్లవాయి గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రతిమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతకు వారి ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా ఉచిత శిక్షణ అందించి, ఉపాధి మార్గాలను చూపించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. యువతకు శిక్షణ కార్యక్రమాల సమాచారం వాట్సాప్ ద్వారా అందిస్తూ, వారికి భవిష్యత్తులో ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
అదేవిధంగా ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం, కంటి పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచిత కంటి వైద్యం, కళ్లద్దాలు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు.
మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారి సూచనలు, సలహాల మేరకు మార్లవాయి గ్రామాన్ని సందర్శించామని, గ్రామ చరిత్ర, ఆదివాసీ సంస్కృతి, హైమన్ డార్ఫ్ దంపతుల సేవల గురించి తెలుసుకుని గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని గీతారెడ్డి తెలిపారు.
గ్రామానికి వచ్చిన ప్రతిమ ఫౌండేషన్ బృందానికి గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ స్వాగతం పలికి, గ్రామ అభివృద్ధి మరియు యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుంరం విఠల్, రాజన్న, వివిధ గ్రామపంచాయతీల ప్రతినిధులు, పీసా మొబైల్స్, పంద్రా సేకు, ఆత్రం మారుతి, లక్ష్మణ్, మెస్రం జంగు, హైమన్ డార్ఫ్ యూత్ సభ్యులు సోనేరావు, తుకారాం, నాగేష్, లచ్చు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ యువతకు ఉపాధి, విద్యార్థులకు భరోసా, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే ప్రతిమ ఫౌండేషన్ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.







