మంచిర్యాల్ జిల్లాలో అంటువ్యాధులు, వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల నియంత్రణ, అందిస్తున్న వైద్య సేవలపై జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) పరిశీలకుడు డాక్టర్ శ్యామ్ సమీక్షించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ వార్డులను ఆయన పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తో కలిసి డాక్టర్ శ్యామ్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అంటువ్యాధులు, వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల (వ్యాక్సిన్ ప్రివెంటేబుల్ డిసీజెస్) నియంత్రణ, వాటి వ్యాప్తి పర్యవేక్షణపై అందిస్తున్న సేవల గురించి డాక్టర్ నరేందర్ రాథోడ్ వివరించారు. జిల్లాలో వ్యాక్సిన్ ప్రివెంటేబుల్ డిసీజెస్ కోసం 100 వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు, సుమారు 12 రకాల ప్రాణాంతక వ్యాధులు పిల్లలకు రాకుండా నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సంక్రమణ వ్యాధులు, కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా కేసులను గుర్తించడం, వ్యాధిగ్రస్తులను నమోదు చేయడం, మందులు అందించడం, అవగాహన కల్పించడం, పౌష్టికాహారం అందజేయడం వంటివి చేస్తున్నట్లు తెలిపారు. జీవనశైలి మార్పులతో వచ్చే అసంక్రమణ వ్యాధులైన బీపీ, డయాబెటిస్, క్యాన్సర్ల నిర్ధారణ కోసం వైద్య బృందాల ద్వారా ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, 30 ఏళ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేసి మందులు అందిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ప్రివెంటేబుల్ డిసీజెస్ కు టీకాలు వేయించుకోవడం ద్వారా ఈ వ్యాధులను దూరం చేయవచ్చని, పోలియో, రుబెల్లా, డిఫ్తీరియా వంటి వ్యాధులు పిల్లలకు రాకుండా నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల పిల్లల వైద్య నిపుణులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో జ్వరాలు, సంబంధిత వ్యాధులను గుర్తించి నమూనాలను పరీక్ష చేయిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో కేసులు ప్రబలకుండా యాక్టివ్ సర్వే నిర్వహించడం, ఆసుపత్రులలో చేరే రోగులకు అవసరమైన సేవలు అందించడం, రోజువారీగా నమూనాలు సేకరించి పరీక్షించడం జరుగుతోంది. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా మైక్రోబయాలజిస్టులు రోజువారీ నమూనాలను పరీక్షించి, వైద్యాధికారులకు, ప్రత్యేక వైద్య నిపుణులకు పంపుతున్నారు. రక్త నమూనాలను హైదరాబాద్కు పంపించి పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేదా వ్యాధి వ్యాప్తి (అవుట్ బ్రేక్) సంభవించినప్పుడు జిల్లా వైద్య బృందం తక్షణ చర్యలు చేపడుతుంది. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటివి ప్రబలకుండా గ్రామ పంచాయతీ, మున్సిపల్ సహకారంతో నిఘా కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. జూనోటిక్ డిసీజెస్ (జంతువుల ద్వారా వచ్చే వ్యాధులు), పాము కాటు, కుక్క కాటు ద్వారా వచ్చే ర్యాబిస్ వంటి వాటి నివారణకు అన్ని కేంద్రాలలో వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచారు. ప్రతి కేసు వివరాలను నమోదు చేసి, కుక్కకాటు, పాముకాటు బాధితులకు తక్షణ వైద్య సేవలు, క్రిటికల్ కేర్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన పరిశీలకులు, రోగుల వివరాలను నమోదు చేయడం ద్వారా వ్యాధులను గుర్తించి, తక్షణ చర్యలు చేపట్టడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే, రోజువారీగా కుక్కకాటు, పాముకాటు బాధితుల వివరాలను నమోదు చేయడం, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచడం, క్రిటికల్ కేసులకు చికిత్సలు అందించడం జరుగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు.












