తెలంగాణ రాష్ట్రంలో సూపర్ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ఎల్ నినో తీవ్రత వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ విపత్తును కరోనా మహమ్మారి తరహాలోనే ప్రజలందరి సహకారంతో సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
నియోజకవర్గంలో ఎల్ నినో కారణంగా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. యాసంగిలో రైతులు నీటి లభ్యతను బట్టి అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేస్తోందని తెలిపారు. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
కీ.శే. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు అందించే చీరలను ఈసారి సంక్రాంతి పండుగకు 10 రోజుల ముందు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులరీత్యా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, సంక్రాంతికి తమ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, , లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












