రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో గల భీమిని పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, వాహనాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ భీమిని పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. తాండూర్ సీఐ దేవయ్య, భీమిని ఎస్ఐ కోటేశ్వర్ ఆయనకు స్వాగతం పలికారు. డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టేషన్ పరిసరాలు, కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను డీసీపీ పరిశీలించారు. ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రిసెప్షన్ సెంటర్లోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో మాట్లాడుతూ, ఆన్లైన్లో కేసుల నమోదు, అప్లోడ్ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులను డీసీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ వ్యవహారాలపై సీఐ దేవయ్య, ఎస్ఐ భూమేష్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని డీసీపీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేకంగా కృషి చేయాలని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి అవసరం, ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని డీసీపీ సూచించారు.

