అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాండ్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ ఈ విషయాన్ని తెలిపారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బాండ్ల పరిశీలన ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
హాజరుకావాల్సిన బాధితులు
బాధితులు తమ ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్లు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా పాస్‌బుక్‌తో పాటు సంబంధిత ఇతర పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. బాధితులు అందుబాటులో లేని పక్షంలో వారి కుటుంబ సభ్యులు, నామినీలు లేదా చట్టబద్ధ వారసులు సంబంధిత పత్రాలతో హాజరుకావచ్చని తెలిపారు. ముఖ్యంగా, బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీల్లోనే పరిశీలన కేంద్రానికి హాజరుకావాలని, తద్వారా ఎలాంటి రద్దీ, అసౌకర్యం లేకుండా ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని తెలిపారు.
పత్రాల సమర్పణకు సీఐడీ మార్గదర్శకాలు
బాధితుల పరిస్థితిని బట్టి ఐదు రకాలుగా పత్రాల సమర్పణకు సీఐడీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఐదు రకాలకు చెందిన వ్యక్తులు తప్పనిసరిగా ఒరిజినల్ బాండ్‌తో పాటు, ఫోటో, పాన్ కార్డు వెంట తీసుకెళ్లాలి. సెల్ నంబర్ వివరాలు, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ వివరాలు, తెలిసి ఉంటే ఏజెంట్ ఫోన్ నంబరు వివరాలు కూడా నమోదు చేయాలి.
తప్పనిసరిగా వెంట తీసుకొని రావలసిన పత్రాలు
1. డిపాజిటర్ జీవించి ఉంటే: ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్. అందులో ఖాతాదారుడి పేరు, ఖాతా నంబర్, కోడ్ స్పష్టంగా ఉండాలి. 2. డిపాజిటర్ మరణించి, నామినీ జీవించి ఉంటే: నామినీ సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, డిపాజిటర్ మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. నామినీ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్, రేషన్ కార్డ్ లేదా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. నామినీ బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్. 3. డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణించి ఉంటే: అసలు బాండ్, చట్టబద్ధ వారసుడు లేదా కుటుంబ సభ్యుడు సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, డిపాజిటర్, నామినీ ఇద్దరి మరణ ధ్రువీకరణ పత్రాలు. వారసుడి ఆధార్, పాన్ కార్డులు, రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం లేదా చట్టబద్ధ వారసత్వ ధ్రువీకరణ పత్రం. వారసుడి బ్యాంకు పాసుబుక్ మొదటి పేజీ జిరాక్స్. ఈ కేటగిరీలో ఆధార్, పాన్, మరణ ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్ కూడా పరిశీలన కోసం చూపించాల్సి ఉంటుంది.
4. డిపాజిటర్ జీవించి ఉండి, కేంద్రానికి రాలేని పరిస్థితిలో: డిపాజిటర్ అసలు బాండ్, సంతకం చేసిన కలర్ జిరాక్స్, డిపాజిటర్ ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్, ఫోటో జిరాక్స్, ఒరిజినల్స్ చూపించాలి. కేంద్రానికి వచ్చే కుటుంబ సభ్యుడి ఆధార్ లేదా గుర్తింపు కార్డు. డిపాజిటర్ తో కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రం. రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ద్వారా సంబంధాన్ని నిర్ధారిస్తారు. డిపాజిటర్ నుంచి అధికారిక అనుమతి పత్రం (ఆథరైజేషన్ లెటర్) తప్పనిసరి.



