ఢిల్లీ / చీరాల, 19 November
దేశవ్యాప్తంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఢిల్లీ చలో కార్యక్రమం జరిగింది. ఈ సభలో రాష్ట్ర జేఏసీ ఆటో చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ ఆటో కార్మికుల సమస్యలపై తన గళాన్ని వినిపించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (), భారతీయ మజ్దూర్ సంఘ్ () అనుబంధ విభాగం ఆధ్వర్యంలో ఢిల్లీ చలో కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఆటో కార్మికులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర జేఏసీ ఆటో చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ హాజరై, ఆటో కార్మికుల సమస్యలపై తన గళాన్ని వినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఆటో డ్రైవర్ల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, ఎండనకా వాననకా రాత్రింబవళ్లు ప్రజలకు రవాణా సేవలు అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే వారి కష్టానికి తగిన గుర్తింపు, భద్రత, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్లు
ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్లలో భాగంగా, ప్రతి రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు, రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పిల్లల విద్యకు ఆర్థిక సహాయం, వృద్ధాప్య పింఛన్లు, ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆటో డ్రైవర్ల ఉపాధికి ఆటంకం కలగకుండా త్రీ వీలర్ ఆటో లైసెన్సుల పునరుద్ధరణపై ఉన్న సమస్యలను పరిష్కరించి, అర్హులైన డ్రైవర్లకు వెంటనే లైసెన్సులు జారీ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రవాణా నిబంధనలకు అనుగుణంగా, అవసరమైన అనుమతులు మరియు వాణిజ్య టాక్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలకే సేవలు నిర్వహించే అవకాశం కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా టాక్సీ ప్లేట్ లేకుండా వాణిజ్య రవాణా నిర్వహించే వాహనాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల చట్టబద్ధంగా జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ పథకాల ద్వారా ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, కుటుంబ భద్రత, పెన్షన్ సదుపాయాలు కల్పించడంతో పాటు, వారి పిల్లలకు విద్యా సహాయం అందించాలని కోరారు. కొత్త రవాణా విధానాలు, డిజిటల్ ట్రాన్స్పోర్ట్ సేవల కారణంగా సంప్రదాయ ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలను రూపొందించాలని, ఆటో కార్మికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకుని మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆటో డ్రైవర్లు కేవలం వాహనాలు నడిపే వ్యక్తులు మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాలకు జీవనాధారమని పేర్కొన్నారు. వారి చెమటకు తగిన గౌరవం, వారి కుటుంబాలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ వేదికగా ఆటో కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆటో కార్మికుల సమస్యలను ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ప్రతి రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేశారు. అల్లూరి రవి శంకర్ గారి సారథ్యంలో చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమం విజయవంతం చేశారని తెలుపుతూ, ఆటో మరియు రవాణా కార్మికుల ఐక్యతే మన బలం, వారి హక్కుల సాధనే మన లక్ష్యం. ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సంక్షేమం, భద్రత, గౌరవం కల్పించే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు.


