జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలను ఆయన పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, వైద్య పరికరాలు, కార్డులు, రిజిస్టర్లు, వివిధ విభాగాలు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, చిన్నారుల చికిత్స విభాగం, ఐసియూ గదులు, పడకలు, పిల్లల విభాగంలో ఏసీలు, పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రికి ప్రతిరోజూ వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, వారి బరువు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా వైద్యులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోగులకు వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఆసుపత్రిలో ఇంకా సదుపాయాలు, వైద్య పరికరాలు, ఏసీలు ఇతరత్రా అవసరం ఉన్నట్లయితే వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని, మరమ్మతులకు గురైనట్లయితే వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. రోగులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలను కల్పించాలని, ఆసుపత్రి అధికారులు కోరిన అవసరమైన సదుపాయాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో మద్యం సేవించి వచ్చి గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. అశోక్ కుమార్, ఆర్ఎంఓ డా. శ్రీధర్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


