మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానిక విశ్వనాథ ఆలయంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజలు, అభిషేక కార్యక్రమాల్లో కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి జయంతిని అధికారికంగా గుర్తించి జీవో జారీ చేసిందని తెలిపారు. వాసవి క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అభినందించారు.
జయంతి వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, చీర సారె సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఆలయ ఆవరణలో 350 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ, నరహరి శర్మ పర్యవేక్షించారు.
వేడుకల్లో భాగంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని అందజేశారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా పెద్ద ఎత్తున శోభాయాత్రను నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో వాసవి క్లబ్ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, మహిళలు, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



