మంచిర్యాల పోలీసులు ఒక భారీ చోరీ కేసును ఛేదించారు. రూ.7.8 లక్షల విలువైన 311 గ్రాముల బంగారం, కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం.
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్, సీఐల సమక్షంలో చోరీ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల, రెడ్డిమల్ల ఆకాష్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారని, వీరిపై చంద్రపూర్, నాగ్పూర్ ప్రాంతాల్లో 12కు పైగా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, గౌతమేశ్వర కాలనీకి చెందిన ముదం నాగయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి తన స్వగ్రామానికి వెళ్లిన సమయంలో, ఆయన ఇంట్లో చోరీ జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత తాళాలు పగులగొట్టి, బీరువాలోని బంగారం, వెండి, నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల బస్స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో, నిందితులు తనఖా పెట్టిన బంగారం, నగదును జల్సాలు, బెట్టింగ్లకు ఖర్చు చేసినట్లు అంగీకరించారు. మహారాష్ట్ర పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకే తెలంగాణలో నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రజలు వేసవి సెలవుల్లో ఇళ్లలో నగదు, విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్త పడాలని పోలీసులు సూచించారు.







