మంచేరియల్, 2026-07-18
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ ఎస్టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికుల నివాస ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, 22 మోటార్ సైకిళ్లు, 6 మినీ బస్సులు, 9 ట్రాలీ వాహనాలు, 4 ఆటోరిక్షాలతో సహా 41 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జైపూర్ ఎస్టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. జైపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల నివాస ప్రాంతాల్లోని బ్యారక్లలో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా 22 మోటార్ సైకిళ్లు, 6 మినీ బస్సులు, 9 ట్రాలీ వాహనాలు, 4 ఆటోరిక్షాలతో సహా మొత్తం 41 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హాజరై ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులతో సమావేశమయ్యారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు తమ స్వగ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుంచి తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొనే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) తీసుకుని వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని ఏసీపీ సూచించారు. అలాగే, కార్మికులు నివసించే బ్యారక్ల పరిసరాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్లాంట్ యాజమాన్యానికి సూచించారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయిని సేవించరాదని, కొనుగోలు చేయరాదని, విక్రయించరాదని, రవాణా చేయరాదని ఏసీపీ స్పష్టం చేశారు. గంజాయి విక్రయిస్తున్నా, సరఫరా చేస్తున్నా లేదా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నా వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గంజాయి సంబంధిత నేరాల విషయంలో పోలీసు శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు స్థానిక చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని సూచించారు. గుర్తింపు కార్డులు, ఆధార్ వంటి ధ్రువీకరణ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలని, తమ పూర్తి వివరాలను ప్లాంట్ యాజమాన్యం వద్ద నమోదు చేయించాలని తెలిపారు. ప్లాంట్ పరిసరాల్లో గొడవలు, మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, చట్టవిరుద్ధమైన పనుల్లో పాల్గొనడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
వ్యక్తిగత సమస్యలు, వేధింపులు లేదా అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. సైబర్ నేరాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. మోసపూరిత కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే సమీప పోలీసులకు లేదా 1930 సైబర్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ప్రతి కార్మికుడు చట్టాలను పాటిస్తూ పరస్పర సహకారంతో పనిచేస్తే సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, నేరాల నివారణ కోసం పోలీసుశాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సమయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.












